Sunday 24 March 2013

శివ మానస పూజ


ఈశ్వరుని (లేదా ఇష్ట దైవాన్ని లేదా సద్గురువుని) నిత్యమూ, నిరంతరముగా మాననసికంగా పూజించుకోవడానికి వీలుగా శ్రీ శంకరాచార్యులవారు, కేవలము ఐదు శ్లోకాలతో కూడిన "శివ మానస పూజ" అనే స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు. ఈ స్తోత్రానికి ఇంగ్లీషులో అర్ధం ఈ లింకు వద్ద కలదు. ఈ స్తోత్రము తెలుగు-లిపిలో ఈ లింకు వద్ద కలదు. పై రిఫరెన్సులు ఆధారంగా, ఆ శ్లోకాలకు నేను తెలుగులో వ్రాసుకున్న భావాలు ఎవరికైనా ఉపయోగపడతాయేమోనని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

దయా నిధివైన ఓ దేవా! ఓ పశుపతీ! నీ కొరకు నేను నా మనస్సునందు రత్నములతో కూడిన ఒక ఆసనమును కల్పించుకున్నాను. నీకు స్నానము చేయించుటకు - హిమాలయములందలి మంచు కరుగగా ఏర్పడిన నీటిని, నీవు ధరించుటకు - దివ్యమైన వస్త్రములను, నిన్ను అలంకరించుటకు - పలు రకములైన రత్నాభరణములను, నీకు పూయడానికి - కస్తూరి చందనములను, నీ మెడలో వేయుటకు - సంపెంగలు, మారేడు దళములు, అనేక పుష్పములతో  కట్టిన పూల మాలలను, ధూపమును, మరియు దీపమును నీకు మానసికముగా సమర్పించుకొనుచున్నాను. నీవు వీటిని స్వీకరించ వలసినది.

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఓ ప్రభూ! నవరత్నములతో పొదగబడిన బంగారు పాత్రలలో - నెయ్యి వేసిన పాయసమును, ఐదు రకములైన భక్ష్యములను, పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకము, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరము కలిపిన రుచికరమైన జలములను, మరియు తాంబూలమును నీకు మానసికముగా భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! నీవు వీటిని స్వీకరించ వలసినది. 

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఓ ప్రభూ! నీకు ఆచ్చాదనగా ఛత్రమును (గొడుగును), నీకు వీచుటకై రెండు చామరములను, శుద్ధమైన అద్దమును, వీణ, భేరీ, మృదంగాదులతో కూడిన నృత్య గీతములను, సాష్టాంగ ప్రణామములను,  మరియు పలు విధములైన స్తుతులను - వీటినన్నింటినీ, సంకల్పమాత్రముగా నీకు భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! ఈ నా పూజను నీవు స్వీకరించవలసినది.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

ఓ శంభో, నా ఆత్మయే నీవు; నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, ఓ శంభో, మీయొక్క ఆరాధనయే!

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

నా కర చరణములు, వాక్కు, శరీరములతో చేసిన కర్మలలోగానీ, నా కన్నులు, చెవులుతోగానీ, మానసికంగాగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, నే చేసిన అపరాధములు అన్నింటినీ, కరుణా సముద్రుడవైన ఓ మహాదేవ శంభో,  నీవు దయతో క్షమించుము.