ప. గిరి పై నెలకొన్న రాముని
గురి-తప్పక కంటి
(సువేల పర్వత శిఖరంపై నెలకుని ఉన్న శ్రీరామచంద్రమూర్తిని, గురి-తప్పక చూసితిని.
ఇక్కడ "గురి-తప్పక" అంటే, శ్రీరాముని చూడడం మైకంలోనో లేక కలలోనో కలిగిన బ్రమ/అనుభూతి కాదని, శ్రీరాముని పత్యక్ష దర్శనమవ్వడంలో ఎంతమాత్రం సంశయము/పొరపాటు లేదని చెబుతున్నరేమో? లేదా.... ఆయన లక్ష్యం (గురి) అయిన శ్రీరాముని ప్రత్యక్ష దర్శనాన్ని పొందానని చెబుతున్నరేమో?)
అ.ప. పరివారులు విరి సురటులచే
నిలబడి విసరుచు కొసరుచు సేవింపగ (గిరి)
(శ్రీరాముని యొక్క పరివారము ఆయనచుట్టూ నిలబడి, పూలతో చేసిన చామరములతో విసురుతో వున్నప్పుడు, గిరిపై నెలకుని ఉన్న శ్రీరాముని గురి తప్పక చూసితిని.)
చ. పులకాంకితుడై ఆనంద-అశ్రువుల
నింపుచు మాటలు-ఆడ వలెను-అని
కలవరించ కని పది పూటల పై
కాచెదను-అను త్యాగరాజ వినుతుని (గిరి)
(శ్రీరాముని చూడడంతో పులకాంకితుడై, కన్నులు ఆనందాశ్రువులతో నిండిన త్యాగరాజు, "రామా, నీతో మాట్లాడవలెను" అని అనగా, అప్పుడు శ్రీరాముడు, "నిన్ను పది రోజుల తర్వాత కరుణించెదను" అని చెప్పెను. )
శ్రీరాముని దర్శనం అయిన తర్వాత తొమ్మిదవనాడు (శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు రోజు) త్యాగయ్య గారు సన్యాస దీక్ష తీసుకున్నారట. అప్పుడే, వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత, వారిని యెక్కడ ఎలా సమాధి చెయ్యాలో కూడా వారి శిష్యులకు చెప్పారట.
ఆ మరుసటి రోజున (పదవ నాడు), పూజానంతరం, తన్మయత్వంతో, ఈక్రింద వ్రాసిన కృతిని పాడుతో, శరీరాన్ని విడిచిపెట్టి, రామునిలో ఐక్యం అయ్యారట!
ఇదే వారు వ్రాసిన చిట్టచివరి కృతి:
ప. పరితాపము కని-ఆడిన
పలుకులు మరచితివో నా (పరి)
(శ్రీరామా, నా దయనీయమైన స్థితిని చూసి నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)
అ.ప. సరి-లేని సీతతో
సరయు మధ్యంబున నా (పరి)
(నీవు సాటిలేని సీతమ్మ తల్లితో సరయూనది యందు వున్నప్పుడు, నా దయనీయమైన స్థితిని చూసి నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)
చ. వరమగు బంగారు వాడను
మెరయుచు పది పూటల-పై
కరుణించెదను-అనుచు క్రే-
కనుల త్యాగరాజుని (పరి)
(నీవు అప్పుడు చక్కనైన బంగారు నావలో ప్రకాసిస్తో, నా దయనీయమైన స్థితిని క్రేగంటచూసి, "పది రోజుల తర్వాత నిన్ను కరుణించెదను" అని నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)
References:
http://sahityam.net/wiki/
http://sahityam.net/wiki/
http://www.eemaata.com/em/
http://thyagaraja-vaibhavam.
http://thyagaraja-vaibhavam.