Sunday, 28 April 2013

సుఖపడుట ఎలా?

సుఖపడుట ఎలా? (గురుపూజల సందర్భముగా మాస్టర్ ఇ.కె. గారు అనుగ్రహించిన ఒక ఉపన్యాసమునుండి తీసుకొనబడిన చిన్న భాగం)

"ఓం శాంతిః శాంతిః శాంతిః"
"శాంతి" అన్న శబ్దానికి, "మనస్సు శాంతిగానుండు గాక, ఆత్మ శాంతిగానుండు గాక, చిత్తము శాంతిగానుండు గాక!" అని అర్ధం. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, "చుట్టుప్రక్కల వాళ్ళంతా, ఇంట్లో వాళ్ళంతా, బంధువులంతా, భార్య పిల్లలు అందరూ, ఆఫీసులో అందరూ ఉండనిస్తే శాంతిగా ఉంటుంది" అని అనిపిస్తుంది, కరుడుగట్టిన అజ్ఞానికి! అది కాకుండా "శాంతిగా ఉండటం" అంటే "మనం శాంతిగా ఉండటం" గానీ "వాళ్ళు ఉండనివ్వడం" కాదు అనే రహస్యం తెలిసినటువంటివాడికి, "శాంతిగా ఉండటం" తప్ప "అశాంతిగా ఉండటం" ఎన్నడూ ఉండదు. ఈ స్థితినుండి ఆ స్థితికి మనం రావాలి.

మనం శాంతిగా ఉండటానికి ఎన్నో విఘ్నాలు కనిపిస్తాయి, అజ్ఞానికి! "విఘ్నాలు" అంటూ నువ్వు సృష్టించుకున్నవి మినహా బయట ఎక్కడా లేవు అనే సంగతి తెలుస్తుంది. "పరిస్థితులు బాగుంటే..." అన్నటువంటి వాడికి, ప్రపంచంలో, వాడుగానీ, ఇంకొకడుగానీ, వాడి పరిస్థితులను ఎన్నడూ బాగు చెయ్యలేరు. ఇంతవరకూ సృష్టిలో ఎవ్వడూ బాగుచెయ్యలేదు. పరిస్థితులు బాగుండడం కాకుండా, తాను బాగుంటే, పరిస్థితులు తనచేత వెలిగింపబడతాయనేటువంటి రహస్యం తెలిసేదాకా జీవితం చీకటి కోణమే; వెలుగుబాట ఎన్ని దీపాలు పెట్టినా ఉండదు.

"సుఖపడేది ఎలాగ?" అని కోరిన దరిద్రుడికి సుఖం ఉండదు. "సుఖంగా ఉండడం" అనేది తెలిసినవాడికి మిగిలినవన్నీ సుఖం ఇస్తాయి. "సుఖంగా ఉండడం" అనేది ఇంకొక కండిషనుకు లొంగినదైతే, అది సుఖం అనేటువంటి పేరుకు తగినటువంటిది కాదు. సెకండ్-రేట్ థింగ్ అవుతుంది. సుఖము అద్వితీయము, పరబ్రహ్మ స్వరూపము గనుక, దానిని పరిస్థితులు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నించేటువంటి పిచ్చివాడికి లొంగేటువంటిది కాదు. బలహీనునికి లొంగేటువంటిది కాదు.

సుఖంగా ఉండటం అనేది - లోపల మనస్సులో, హృదయములో, ఆత్మలో, ఇంద్రియాలలో ప్రారంభమవుతుంది. అక్కడనుండి క్రమంగా శరీరానికి, పరిసరాలకి, ప్రాంతానికి; తన దినచర్య వలన తన భార్యా పిల్లలు "సుఖపడుట" నేర్చుకొనుట, వాళ్ళ వలన తాను సుఖపడుట నేర్చు
కొనుట, వాళ్ళ వాతావరణం వలన ఎవరైనా అతిథులు, వారి ఇంటికి వచినవాళ్ళు కూడా సుఖపడుట నేర్చుకొనుట, అట్లాంటి కుటుంబములు ఒక వెయ్యి కుటుంబములు, ఇలాంటి చోట గురువులయొక్క చరణారవిందముల వద్దకు చేరినట్లయితే, సుఖపడుటలో వెనుకబడి ఉన్న జాతులు ఎవరన్నా ఉన్నట్లయితే, ఒకరినుంచి ఒకరు సుఖపడుట నేర్చుకుని, అందరూ సుఖములో ఉండుట జరుగుతుంది. వెనుకబడిన జాతులు ముందుకు రావడం కాదు చెయ్యాల్సింది, ముందుకు వస్తే, కొందరు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది!  కానీ అందరూ సుఖములో ఉండుట అనే నిజమైన సెక్యులర్ స్టేట్ మనకు కావాలి. అలాంటి శాంతి మనకు కలుగు గాక.