క్రితం శనివారం (3 మే 2014) అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ఫ్రాంక్లిన్ జూపార్క్ కి ఉదయమే బయలుదేరి వెళ్ళాము. భగవంతుడి దయవలన ఆ రోజు వాతావరణంకూడా (చాలా రోజుల తర్వాత) బాగుంది. జూపార్క్ మరీ పెద్దది కాదుగానీ - పరవాలేదు; ఒక గొరిల్లాల కుటుంబము, ఓ ముసలి-సింహము, ఓ మామూలు పులి, జన్యు లోపాలవలన తెల్లగా ఉన్న మరో పులి, చెట్లమీద నివసించే కంగారు, వేగంగా దూకుతూ పరుగెత్తగల మరో కంగారు, జడల ఒంటె - ఇలా మచ్చుకకి ఒక్కొక్క జంతువు చప్పున ఉన్నాయి. అలానే చాలా రకాల పక్షులుకూడా ఉన్నాయి.
ఉదయంనుండి నిదానంగా జూపార్క్ అంతా చూచి ఇక ఇంటికి బయలుదేరదాము అనుకునేటప్పడికి సాయంసంధ్యా సమయం (సుమారుగా 5 గం||) అయ్యింది. అప్పుడప్పుడే ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. మేము బయటకు వెళ్ళడానికి మెయిన్-గేట్ దగ్గరకి వస్తుంటే ఇంతలో ఒక నెమళ్ళ గుంపు ఎదురైంది :-) ఆ నెమళ్ళను మేము చుస్తూ ఉండగానే అందులోని ఒక మగ నెమలి పురి విప్పింది. నెమలి పురి విప్పి, సొగసుగా అడుగులు వేస్తూ తిరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా చూడడం నాకు ఇదే మొదటిసారి!
ఇక అసలు చెప్పదలుచుకున్న విషయానికి వద్దాము... పైన చెప్పిన సన్నివేశం, శివానందలహరిలో శంకరాచార్యులవారు, "నీలకంఠుడైన" పరమశివుని - "నీలకంఠయైన" నెమలితో పోల్చుతూ వ్రాసిన మనోహరమైన రెండు శ్లోకాలను మనసారా స్మరించుకుని ఆనందించేలా చేసింది. ఆ రెండు శ్లోకాలను ఇక ఇప్పుడు మీరుకూడా చదివి, వాటిని మానసికంగా అస్వాదించి ఆనందించడమే ఆలస్యం :-)

మొదటి శ్లోకం:
నెమలికి తలపై శిఖ (చుంచు) ఉన్నట్లుగానే, ఈశ్వరుడు ఆకాశాన్నే తన శిఖగా (ముడి వేయబడిన జటాజూటముగా) కలిగియున్నాడు.
నెమలికి సర్పము ఆహారము కాబట్టి, సర్పాన్ని నెమలికి ఆభరణముగా భావన చెయ్యవచ్చును; నెమలికి సర్పము ఆభరణమైనట్లుగానే, పరమశివుడు సమస్త సర్పములకు ప్రభువైన వాసుకుని తన మెడలో ఆభరణముగా (కలాపముగా) ధరించియున్నాడు. (నెమలి మెరిసే పింఛములను ఆభరణములుగా కలిగియున్నట్లే, శివుడు నాగ మణుల కాంతులతో ప్రకాశించే వాసుకిని తన మెడలో ఆభరణముగా ధరించియున్నాడన్న మరొక అర్ధంకూడా ఇక్కడ అన్వయించుకోవచ్చును.)
పరమేశ్వరుడు తనను ఆశ్రయించినవారిని అనుగ్రహించి, వారికి ప్రణవమును (ఓంకారమును) ఉపదేశించుచున్నప్పుడు అగు శబ్దములు - ఆనందముతో నెమలి అరుచుచున్నప్పుడు వినిపించు "కేకీ" ధ్వనులవలే ఉన్నవి.
నల్లనివి (శ్యామాం), పర్వతములవలన పుట్టినవి (శైల సముద్భములు) అయిన మేఘముల ప్రకాశమును చూచి, నెమలి ఆనందముతో పురివిప్పి నృత్యం చేస్తుంది. అలానే, పరమేశ్వరుడు - శ్యామల వర్ణము కలిగినది, శైల పుత్రి (హిమవంతుని కుమార్తె) అయిన పార్వతీదేవిని చూచి ఆనందముతో నృత్యం చేయును. అటు మేఘానికి, ఇటు పార్వతీదేవికి ఇద్దరికీ అన్వయమయ్యే "శ్యామాం", "శైల సముద్భవాం" అనే విశేషణాలను వాడడం శంకరాచార్యులవారి రచనా చమత్కృతి!
ఇక రెండవ శ్లోకం:
సన్ధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా
భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్వల తాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే (54)
చల్లని పిల్లగాలులు వీస్తున్న వేళలో, నల్లని కారు మేఘాలు గర్జిస్తుండగా, ఆకాశంలో మెరుపులు మెరుస్తుంటే, వర్షపు చిరు జల్లులు కురుస్తున్న సమయంలో - మగ నెమలి తన ఎదురుగానున్న ఆడ నెమలిని చూచి పరవశంతో నృత్యం చేస్తుంది. అలానే, ఇక ఇప్పుడు శంకరాచార్యులవారు పరమశివుడు చేసే ఆనంద తాండవాన్ని ఈ శ్లోకంలో మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు:
"అది సాయం సంధ్యా సమయం. పగటిపూట ఉన్న వేడి గాళుపులు తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుతో సహా సమస్త దేవతులు, మహా భక్తులు కైలాసంలోని పరమశివుని సన్నిధికి చేరుకున్నారు. విష్ణువు మృదంగము వాయించసాగాడు; అప్పుడు విష్ణువుయొక్క చేతినుండి ఉత్పన్నమైన ధ్వని మేఘగర్జన (ఉరుము) వలే ఉన్నది. అచ్చట సంభ్రమముతో వీక్షించుచున్న దేవతా సమూహముల చూపులన్నీ కలిసి ఒక మెరుపుతీగవలే ఉన్నది. భక్తుల నేత్రములనుండి వర్షించుచున్న ఆనంద భాష్పములు - వర్షపు జల్లులవలే ఉన్నవి. అప్పుడు, ఆడ నెమలిని పోలిన పార్వతీ దేవిని చూచి, పరవశముతో ఉజ్జ్వలమైన ఆనంద తాండవము చేయుచున్న ఆ నీలకంఠుని నేను భజించుచున్నాను" అని పై శ్లోకముయొక్క భావము.
కొస మెరుపు: ఆ తర్వాత రోజు (ఆదివారం) వరకూ తెలియనేలేదు - మేము జూకి వెళ్ళి, పురి విప్పిన నెమలిని చూచి, శ్రీ శంకరాచార్యులవారు వ్రాసిన శివానందలహరిలోని శ్లోకాలను స్మరించుకునే అవకాసం కలిగిన రోజు - వైశాఖ శుక్ల పంచమి అని. అంటే ఆరోజు శ్రీ శంకర భగవత్పాదుల జన్మదినము!!!