Thursday 1 March 2012

Surya Satakam


మయూర శర్మ విరచితమైన "సూర్య శతకము" గురించి మొట్టమొదటిగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి ఒక ప్రవచనంలో విన్నాను. కాబట్టి, దీనిని గూర్చి ముందుగా వారి మాటలలోనే ఇక్కడ ప్రస్తావించుకుందాము:

"సూర్య శతకాన్ని మయూర శర్మ అనే ఒక మహాకవి వ్రాసారు. అందులోని శ్లోకాలు ఉక్కుపిండాల్లా ఉంటాయి. వాటి యొక్క అర్ధము, కవిత్వము అన్నీకూడా అట్లానే ఉంటాయి.  ఆయన ఈ శతకాన్ని ఒకానొక చిత్రమైన సందర్భంలో వ్రాసారని ప్రతీతి, జన-శృతి. ఆయన చిన్నతనంలో, 5-6 సంవత్సరాల వయస్సులో ఉండంగా చదువుకోవడంకోసమని కాశీ, నవద్వీపం మొదలైన చోట్లకి వెళ్ళిపోయాడు. 12 సం|| అట్లా చదువుకుని, ఆ తర్వాత, 18-20 సం|| వయస్సులో ఇంటికి తిరిగివచ్చాడు. వచ్చేటప్పడికి, నడి వయస్సులో ఉన్న ఒక అందమైన స్త్రీ బావి దగ్గర ఒక చిన్న వస్త్రం కట్టుకుని కూర్చుని బట్టల పిండుకుంటోంది. అప్పుడు అక్కడ నుంచుని ఆవిడమీద 8 శ్లోకాలు చెప్పాడు. అప్పుడు ఆమె, "నేను సంసార స్త్రీని. నేను ఇక్కడకు పనిమీద వచ్చిన దానిని. నన్ను చూసి శృంగార గర్భితంగా ఈ కవిత్వం చెప్పావు గనుక, నువ్వు కుష్ఠు రోగివి అవుతావు" అని వెళ్ళిపోయింది! తీరా ఈయన ఇంటికి వెళ్ళేటప్పడికి, ఆవిడ ఇతని అత్తగారు. జన-శృతిలో ఈ కధ ఉన్నది. తాను చేసిన పనికి అతను చాలా పరితాపం పొందాడు. 2-3 సం|| అయ్యేటప్పడికి అతను కుష్ఠు వ్యాధి పీడితుడయిపోయాడు. ఎన్నో శాస్త్రములు చదువుకుని ఉన్నాడు, కానీ ఏం లాభం? పాపం ఆ వ్యాధితో అలా ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా, కొంతకాలానికి, ఒక మహానుభావుడు కనిపించి, అతనిని ఒక దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి, సౌర అక్షరం ఒకటి ఇచ్చి, "నువ్వు నీ కవిత్వాన్ని ఏం చెయ్యడంవల్ల అయితే నీకు ఈ దుస్థితి వచ్చిందో, దేనిని దుర్వినియోగం చెయ్యడంవల్ల నీకు ఈ దుస్థితి వచ్చిందో, ఆ కవిత్వాన్నే సద్వినియోగంజేసి, సూర్యుడిమీద ఒక శతకం చెప్పు. అది ప్రపంచానికి పనికి వస్తుంది. దానివల్ల నీకున్నూ వ్యాధి నివారణ అవుతుంది" అని చెప్పారు. అతడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పింది ఈ సుర్య శతకం అంటారు."
[అరసవిల్లిలోని (హర్షవిల్లి) సూర్య దేవాలయంలో విశ్వకర్మచే నిర్మితమైన సూర్యదేవుని విగ్రహం]


 ఇందులోని శ్లోకాలు వినడానికి చాలా మనోహరంగానూ, గంబీరమైన భావంతోనూ నిండి ఉంటాయి.

ఆ శ్లోకాలన్నింటినీ ఈ క్రింది లింకు వద్ద వినవచ్చును:
http://mio.to/yyrP

ఈ శతకం తెలుగు-లిపిలో ఈ క్రింది లింకువద్ద కలదు:
http://www.eemaata.com/em/library/suryasatakam/253.html

బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు సూర్య శతకమునకు:  అన్వయ-ప్రతిపదార్ధ-భావార్ధ-వివరణ సహితముగా తెలుగులో చక్కటి గ్రంధాన్ని వ్రాసారు. ఆ పుస్తకము గుర్చి వ్రాయబడ్డ ఒక సమీక్షను ఈ క్రింది లింకు వద్ద చదువగలరు:
http://pustakam.net/?p=7075

మీరుకూడా పైన తెల్పిన పుస్తకాన్ని మరింతగా అస్వాదించాలనుకుంటే,, ఈ క్రింది లింకునుండి ఆన్-లైన్లో (క్రెడిట్ కార్డుతో) ఆర్డర్ చెయ్యవచ్చును:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=6535


పై పుస్తకములోనుండి, మచ్చుకకు ఒక్క శ్లోకానికి మాత్రం వివరణ ఇక్కడ చూద్దాము; మిగతా శ్లోకాలుకూడా అస్వాదించదలుచుకుంటే, మీరుకూడా పుస్తకం తెప్పించుకునేవరకూ నీరీక్షించవలసినదే!!!

గర్భేష్వంభోరుహాణాం-శిఖరిషు చ శితా-గ్రేషు తుల్యం పతంతః
ప్రారంభే వాసరస్య-వ్యుపరతిసమయే-చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తా-స్త్రిభువనభవన-ప్రాంగణే పాంతు యుష్మా
నూష్మాణం సంతతాధ్వ-శ్రమజమివ భృశం-బిభృతో బ్రధ్నపాదాః (3)

ప్రతిపదార్ధము:
అంభోరుహాణాం = పద్మముల
గర్భేషు = నడిమి భాగములందును
శిత-అగ్రేషు = వాడియైన (సన్నని) కొనలు కలవి అగు
శిఖరిషు-చ = పర్వతములయందును (మీదను)
తుల్యం = సమానముగా
పతంతః = పడుచున్నవియు
తథా-ఏవ = ఆవిధముగానే
వాసరస్య = పగటి
ప్రారంభే = ప్రారంభమునందును
వ్యుపరతి-సమయే-చ = ముగింపు (సాయంకాల) సమయమునందును
ఏక-రూపాః = ఒకే (సమాన) రూపము కలవియు
త్రిభువన-భవన-ప్రాంగణే = లోకత్రయము అనెడి భవనపు ముంగిట
నిష్పర్యాయం =  ఒకదాని తరువాత మరియొక ప్రదేసమునందుగా గాక; ఒకేమారుగా
పృవృత్తాః = ప్రవర్త్తిల్లు (ప్రసరించు)చుండునవియు
సంతత-అధ్వ-శ్రమ-జం = ఎడతెగని (క) మార్గ (మున నడుచుటచే కలిగిన) శ్రమకలిగిన దానినేమో అనునట్ట్లు; తోచుచుండు
ఉష్మాణం = వేడిమిని
బిభ్రతః = భ(ధ)రించుచున్నవియు అగు
బ్రధ్న-పాదాః = సూర్యుని కిరణములు
యుష్మాన్ = మిమ్ములను
పాంతు = రక్షించును గాక!

భావార్ధము:
బ్రధ్న పాదములు (బ్రధ్నుడు అను ఒక పురుషుని పాదములు - సూర్యుని కిరణములు) మిగుల విలక్షణమగు స్వభావము కలవి. లోకమున కొందరి పాదములు మెత్తని ప్రదేశములందు పడినట్లు ముండ్లతో రాళ్ళతో నిండిన ప్రదేశములందు పడవు; రవి పాదములు (కిరణములు) అట్లు గాక, సుకుమారమగు పద్మముల అంతర్భాగములందునూ, వాడియగు మొనలు కలిగిన కఠినములగు పర్వతాగ్రములందునూ సమానముగనే పడును (ప్రసరించును) [తనతో కౄరముగా ప్రవర్తించే వారి యెడల, మరియు సున్నితంగా ప్రవర్తించేవారి యెడల కూడా,  ఒకేవిధంగా ప్రవర్తించే సద్గుణము సూర్యునియందు ఉన్నది అనికూడా దీని అర్ధం అయ్యివుండవచ్చునేమోనని అనిపిస్తోంది!] లోకమున సాధారణముగా చాలామంది పాదములు జీవితారంభమున సుకుమారములుగనూ సుందరములుగను ఉండిననూ, వార్ధక్యమున తమ సౌకుమార్య సౌందర్యములను కోల్పోవును. రవి పాదములు పగటి ఆరంభమునను (ఉదయ కాలమునను), అవసాన సమయమునను (సాయంకాలమునను) ఒకే విధముగా ఉండును. [ఏదైనా ఒక పని చేస్తున్నపుడు, ఆ పనిని మొదలు పెట్టినప్పుడు ఎంతటి ఉత్సాహంతో ఉన్నాడో, చిట్ట చివరికి వచ్చేటప్పడికికూడా అదే ఉత్సాహంతో చెయ్యగలిగి ఉండడము అనే అర్ధంకూడా ఇక్కడ ఉండవచ్చునేమో!]  రవి పాదములు భువన త్రయము అను భవనపు ప్రాంగణమునందు (ముంగిలియందంతటనూ) ఒకేమారు పడును (ప్రసరించును). ఎవరికైననూ పాదములు మిరంతరమూ నడచుటవలన శ్రమచేత వెచ్చదనము నొందియుండును. రవి పాదములు అట్టి నిరంతర గమనముచే కలిగిన నిరంతర శ్రమచే అనునట్లు వెచ్చగా నుండును. అట్టి బ్రధ్న (రవి) పాదములు మిమ్ము రక్షించుగాక!

3 comments:

Unknown said...

nice collection sir i like master ek cvv garu


Unknown said...

i like master ek cvv garu


your posts are nice

subrahmanyam Gorthi said...

THanks Raghu garu for the kind comments. Glad to know that you like Master EK garu & Master CVV garu. May the Masters bless us all.