Thursday 14 June 2012

ఆనతినీయరా హరా

నాకెంతో ఇష్టమైన శివునిపై పాటనుగూర్చి, నాకు తోచిన వివరాలు ఈ టపాలో వ్రాస్తున్నాను:

ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా

నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగ మాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
అచలనాథ అర్చింతునురా
ఆనతినీయరా... (1)

జంగమ దేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము సేతురా
ఆనతినీయరా... (2)

శంకరా శంకించకురా
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలి
ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి
నీ కింకరునిగ సేవించుకుందురా
ఆనతినీయరా... (3)

రక్షాధర శిక్షా దీక్షా దక్షా
విరూపాక్షా నీ కృపావీక్షణాపేక్షిత
ప్రతీక్ష నుపేక్ష సేయక పరీక్ష సేయక
రక్ష రక్షయను ప్రార్ధన వినరా
ఆనతినీయరా... (4)

"ఓ హరా! నిన్ను మనసారా స్తుతించగలగడానికి మరియు నీ సన్నిధిని చేరడానికి, నీ అనుజ్ఞ, కృప ప్రసాదించుము" అన్న ప్రార్ధనతో అద్భుతంగా ఈ స్తుతిని ఆరంభము చేసారు. ఈశ్వరునియందే సృష్టి, స్థితి, లయ అనెడి మూడు తత్వాలుకూడా ఇమిడి ఉన్నాయి అన్న విషయాన్ని మొదటి చరణంలో ఎంతో హృద్యముగా వర్ణించారు.

ఇక సిరివెన్నెలగారు వ్రాసిన 3వ చరణానికి, శ్రీ శంకర భగవత్పాదులు రచించిన శివానందలహలరిలోని ఈ క్రింది శ్లోకం స్పూర్తి అయ్యివుండవచ్చునేమో అని నా ఊహ... :D

జడతా పశుతా కలంకితా
కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ
అస్తి యది రాజ మౌలే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ (69)

ఇది ఎంతో చమత్కారమైన, సొగసైన శ్లోకము. ఎందుచేతనో వివరంగా చూద్దాము. ఈ శ్లోకానికి తెలుగులో ఇలా అర్ధం చెప్పుకోవచ్చును:

జడత్వము పశుత్వము కళంకము
కుటిల బుద్ధి నాయందు లేవు దేవా
ఒకవేళ ఉన్నా రాజమౌళీ
నీ ఆభరణముగానుండుటకు నేనెందుకు పాత్రుడనుగాను?

ఆ శ్లోకం వినగానే సహజంగా ఉదయించే సందేహము, "అదేమిటి, అటువంటి లక్షణములు ఉన్నాకూడా నీ ఆభరణముగా (సేవకునిగా) ఉండడానికి ఎందుకు వీలవదు అని ఈశ్వరుని అంతలా దబాయించి మరీ ఎలా అడుగగలుగుతున్నారు?" అని :-)

ఈ ప్రశ్నకు సమాధానము ఈ శ్లోకములో చెప్పకనే చెప్పారు శంకరాచార్యులవారు! పరమశివుని 'రాజమౌళీ' అని సంభోదించడములోనే శ్లేష (pun) ఉన్నది. 'రాజమౌళి' అంటే - 'శిరస్సున చంద్రవంకను ఆభరణముగా ధరించినవాడా' అని అర్ధము. అంటే శివునికిగల ఆభరణాల యొక్క లక్షణాలను చూసుకోమని చెప్పక చెబుతున్నారన్నమాట.

ఆయన ఆభరణాలకుగల లక్షణాలనే ఈ శ్లోకంలో ప్రస్తావించారని కొంచెం జాగ్రత్తగా అలోచిస్తే అర్ధమవుతుంది. ఎలాగంటే, ఆయన కట్టుకున్న పులితోలు జడమైనది. ఆయన తన చేత ధరించిన లేడి పశువు (అందుకే శివుని మృగధరుడు అంటారు; లేడి మాయకు చిహ్నమని చెబుతారు.) శివుడు తన జటాజూటములో తురుముకున్న చంద్రునియొక్క కళలయందు వృద్ధి క్షయములు ఉన్నాయి. అలానే ఆయన మెడలో వేసుకున్న పాము కుటిల బుద్ధి కలది. ("కుటిల చరత్వము" అన్న పదానికి మెలికలు తిరుగుతో చరించు లక్షణము కలది అనికూడా అర్ధము చెప్పుకోవచ్చును.)

కాబట్టి, పై శ్లోకానికి సమగ్రముగా భావము ఇలా చెప్పుకోవచ్చు: ఓ ఈశ్వరా, నీవు ధరించియున్న పులితోలువలే నాకు జడత్వము లేదు. నీ చేతిలోనున్న లేడివలే నాకు పశుత్వము లేదు. నీవు శిరస్సున ధరించిన చంద్రునికివలే నాకు కళంకము లేదు. నీవు మెడలో వేసుకున్న పామువలే నాకు కుటిల చరత్వము లేదు. ఓ రాజమౌళీశ్వరా, ఒకవేళ అటువంటి లక్షణములు నాయందు ఉన్నప్పటికీ, అవి అన్నీ నీ అభరణాలైనప్పుడు నేను మాత్రం నీ ఆభరణంగా అగుటకు ఎందుకు పాత్రుడను కాను?

పై శ్లోకం సిరివెన్నెలగారికి స్పూర్తి అయినా కాకపోయినా, అంత గొప్ప భక్తి భావాన్ని అనుభవించి, మనసును కదిలించే తేట తెలుగు పదాలలో సుమధురంగా మనకు అందజేసినందుకు, వారికి హృదయపూర్వక కృతజ్ఞతతో నమస్కారములు.

No comments: