ఈశ్వరుని (లేదా ఇష్ట దైవాన్ని లేదా సద్గురువుని) నిత్యమూ, నిరంతరముగా మాననసికంగా పూజించుకోవడానికి వీలుగా శ్రీ శంకరాచార్యులవారు, కేవలము ఐదు శ్లోకాలతో కూడిన "శివ మానస పూజ" అనే స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు. ఈ స్తోత్రానికి ఇంగ్లీషులో అర్ధం ఈ లింకు వద్ద కలదు. ఈ స్తోత్రము తెలుగు-లిపిలో ఈ లింకు వద్ద కలదు. పై రిఫరెన్సులు ఆధారంగా, ఆ శ్లోకాలకు నేను తెలుగులో వ్రాసుకున్న భావాలు ఎవరికైనా ఉపయోగపడతాయేమోనని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
దయా నిధివైన ఓ దేవా! ఓ పశుపతీ! నీ కొరకు నేను నా మనస్సునందు రత్నములతో కూడిన ఒక ఆసనమును కల్పించుకున్నాను. నీకు స్నానము చేయించుటకు - హిమాలయములందలి మంచు కరుగగా ఏర్పడిన నీటిని, నీవు ధరించుటకు - దివ్యమైన వస్త్రములను, నిన్ను అలంకరించుటకు - పలు రకములైన రత్నాభరణములను, నీకు పూయడానికి - కస్తూరి చందనములను, నీ మెడలో వేయుటకు - సంపెంగలు, మారేడు దళములు, అనేక పుష్పములతో కట్టిన పూల మాలలను, ధూపమును, మరియు దీపమును నీకు మానసికముగా సమర్పించుకొనుచున్నాను. నీవు వీటిని స్వీకరించ వలసినది.
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
ఓ ప్రభూ! నవరత్నములతో పొదగబడిన బంగారు పాత్రలలో - నెయ్యి వేసిన పాయసమును, ఐదు రకములైన భక్ష్యములను, పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకము, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరము కలిపిన రుచికరమైన జలములను, మరియు తాంబూలమును నీకు మానసికముగా భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! నీవు వీటిని స్వీకరించ వలసినది.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఓ ప్రభూ! నీకు ఆచ్చాదనగా ఛత్రమును (గొడుగును), నీకు వీచుటకై రెండు చామరములను, శుద్ధమైన అద్దమును, వీణ, భేరీ, మృదంగాదులతో కూడిన నృత్య గీతములను, సాష్టాంగ ప్రణామములను, మరియు పలు విధములైన స్తుతులను - వీటినన్నింటినీ, సంకల్పమాత్రముగా నీకు భక్తితో సమర్పించుకొనుచున్నాను. ఓ ప్రభూ! ఈ నా పూజను నీవు స్వీకరించవలసినది.
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
ఓ శంభో, నా ఆత్మయే నీవు; నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, ఓ శంభో, మీయొక్క ఆరాధనయే!
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||
నా కర చరణములు, వాక్కు, శరీరములతో చేసిన కర్మలలోగానీ, నా కన్నులు, చెవులుతోగానీ, మానసికంగాగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, నే చేసిన అపరాధములు అన్నింటినీ, కరుణా సముద్రుడవైన ఓ మహాదేవ శంభో, నీవు దయతో క్షమించుము.
No comments:
Post a Comment