Saturday, 27 November 2010

జగమంత కుటుంబం నాది…

Here is another song by Sri Sirivennela Sita Rama Sastry garu which I like very much. Before, watching the above video where Sastry garu explained the meaning of the lyrics, I have also misunderstood that parts of the lyrics are expressing a feeling of despair. But, after watching this interview, I understood that they don't represent any despair/loneliness (నిరాశ/ఒంటరితనము); on the contrary, they represent the feeling/experience of oneness/totality (ఏకత్వము/పూర్ణత్వము) with all that exists!


జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది || 2 ||
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే   ||జగమంత||

కవినై…. కవితనై….. భార్యనై…. భర్తనై || 2 ||
మల్లెల దారిలో… మంచు ఎడారిలో || 2 ||
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం
కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,
రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని  ||జగమంత||.

మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై || 2 ||
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ..
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని,
చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని ||జగమంత||.

గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగివెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి ||జగమంత||.

Source: http://www.sirivennela-bhavalahari.org/?cat=173

Tuesday, 23 November 2010

నిధి చాల సుఖమా?

త్యాగరాజు గారు పదమూడు సంవత్సరాలు వయసు నుండే అనేక కీర్తనలను వ్రాసి స్వరపరిచారు. ఆయన గురువుగారు శ్రీ సొంఠి వెంకటరమణయ్య గారు త్యాగయ్య గారి ప్రతిభకు ఎంతగానో సంతోషించి, ఆయన గొప్పతనం గురించి తంజావూరు మహారాజుకి చెప్పగా, ఆ రాజుగారు అనేక ధన కనక వస్తు వాహనాది రాజ లాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజుగారు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే "నిధి చాల సుఖమా..."  అనే ఈక్రింది చక్కటి కీర్తన:

ప. నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా

అ. దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని)

చ. దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా (ని)

భావం:

ఓ మనసా, నిజంగా చెప్పు:

  • రాముని యొక్క సన్నిధిలోనుండి ఆయన సేవ చేసుకోవడం సుఖమా? లేక భౌతికమైన ఐశ్య్వర్యాలను అనుభవించడం సుఖమా?
  • పెరుగు, అప్పుడే తీసిన వెన్న, పాలు మొ|| పదార్దములు రుచియా? లేక శ్రీరాముని ధ్యాన భజనములు అనెడి  అమృత-రసము రుచియా?
  • శమము, దమము (శాంతి/పవిత్రత, ఇంద్రియ నిగ్రహము) అనెడి గంగా స్నానము సుఖమా? లేక  చెడు విషయములు అనెడి మురికితో నిండిన బావినీటి స్నానం సుఖమా?
  • అహంకార మమకారాలు అనే బంధాలలో చిక్కుకుని వున్న సామాన్య మానవులను స్తుతించడం సుఖమా? లేక, ఓ మనసా, ఈ త్యాగరాజుచే స్తుతింపబడుతున్న శ్రీరాముని కీర్తన చేయడం సుఖమా?

ఈపాటను నాగయ్య గారు తీసిన త్యాగయ్య సినిమాలో చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆ పాటను క్రింది లింకులో చూడగలరు.




References:

http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/09/thyagaraja-kriti-nidhi-chala-sukhama.html
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81
 

Saturday, 20 November 2010

రామ కోదండ రామ రామ కల్యాణ రామ

వాల్మికి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో 24,000 శ్లోకాలలో వ్రాసారు. అలానే, శ్రీరాముని కీర్తిస్తో త్యాగరాజు గారు, మన తెలుగులో, 24,000 కృతులను వ్రాసారట! అందులోనుంచి మనకు కూడా అర్ధమయ్యే తెలుగు పదాలలో :-) వ్రాయబడిన, తేలికైన ఒక ఆణిముత్యం:


ప. రామ కోదండ రామ రామ కల్యాణ రామ

చ1. రామ సీతా పతి రామ నీవే గతి
రామ నీకు మ్రొక్కితి రామ నీ చే జిక్కితి (రా)

చ2. రామ నీకెవరు జోడు రామ క్రీ-కంట జూడు
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు (రా)

చ3. రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు (రా)

చ4. రామ నీకొక మాట రామ నాకొక మూట
రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట (రా)

చ5. రామ నేనెందైనను రామ వేరెంచ లేను
రామయెన్నడైనను రామ బాయక లేను (రా)

చ6. రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ (రా)


రెండవ చరణంలో, "క్రీ-కంట" అంటే, ప్రక్క నుంచి చూడటం: రామా, కనీసం ఒక్కసారి నావైపు క్రీ-కంట అయినా చూడు అని ప్రార్ధిస్తున్నారు.

మూడవ చరణంలో, "రాయుడు" అంటే, రాజు (lord) అని అర్ధం.

ఐదవ చరణంలో, "రామ నేనెందైనను రామ వేరెంచ లేను" అంటే: రామా, నేను ఎటువంటి పరిస్థితులలో వున్నా(ఎందైనను), నిన్ను తప్ప ఇంకొక (వేరు) విషయాన్ని గురించి ఆలోచించలేను (ఎంచ లేను). "బాయక లేను" అంటే, విడిచి ఉండలేను అని అర్ధం.

ఆరవ చరణంలో, "విరాజ" అంటే: పక్షిరాజు గరుత్మంతుడు. "విరాజ రాజ" అంటే, గరుత్మంతునికి రాజైన విష్ణుమూర్తి. "రామ ముఖ జిత రాజ" అంటే రాముని వదనము(ముఖ) చల్లదనము/ఆనందము ప్రసాదించడంలో చంద్రుని(రాజ) కూడా ఓడించినది(జిత) అని అర్ధం "రామ భక్త సమాజ" అంటే, భక్తులతో కూడి వుండు వాడు అని. "రక్షిత త్యాగరాజ" అంటే, ఈ త్యాగరాజును ఎల్లప్పుడు రక్షించువాడు అని అర్ధం.

ఈ కృతిలోని మిగతా పదాలన్నీ చాలా తెలికైనవే!


మూలం:  http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/06/thyagaraja-kriti-rama-kothanda-rama.html