వాల్మికి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో 24,000 శ్లోకాలలో వ్రాసారు. అలానే, శ్రీరాముని కీర్తిస్తో త్యాగరాజు గారు, మన తెలుగులో, 24,000 కృతులను వ్రాసారట! అందులోనుంచి మనకు కూడా అర్ధమయ్యే తెలుగు పదాలలో :-) వ్రాయబడిన, తేలికైన ఒక ఆణిముత్యం:
ప. రామ కోదండ రామ రామ కల్యాణ రామ
చ1. రామ సీతా పతి రామ నీవే గతి
రామ నీకు మ్రొక్కితి రామ నీ చే జిక్కితి (రా)
చ2. రామ నీకెవరు జోడు రామ క్రీ-కంట జూడు
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు (రా)
చ3. రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు (రా)
చ4. రామ నీకొక మాట రామ నాకొక మూట
రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట (రా)
చ5. రామ నేనెందైనను రామ వేరెంచ లేను
రామయెన్నడైనను రామ బాయక లేను (రా)
చ6. రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ (రా)
రెండవ చరణంలో, "క్రీ-కంట" అంటే, ప్రక్క నుంచి చూడటం: రామా, కనీసం ఒక్కసారి నావైపు క్రీ-కంట అయినా చూడు అని ప్రార్ధిస్తున్నారు.
మూడవ చరణంలో, "రాయుడు" అంటే, రాజు (lord) అని అర్ధం.
ఐదవ చరణంలో, "రామ నేనెందైనను రామ వేరెంచ లేను" అంటే: రామా, నేను ఎటువంటి పరిస్థితులలో వున్నా(ఎందైనను), నిన్ను తప్ప ఇంకొక (వేరు) విషయాన్ని గురించి ఆలోచించలేను (ఎంచ లేను). "బాయక లేను" అంటే, విడిచి ఉండలేను అని అర్ధం.
ఆరవ చరణంలో, "విరాజ" అంటే: పక్షిరాజు గరుత్మంతుడు. "విరాజ రాజ" అంటే, గరుత్మంతునికి రాజైన విష్ణుమూర్తి. "రామ ముఖ జిత రాజ" అంటే రాముని వదనము(ముఖ) చల్లదనము/ఆనందము ప్రసాదించడంలో చంద్రుని(రాజ) కూడా ఓడించినది(జిత) అని అర్ధం "రామ భక్త సమాజ" అంటే, భక్తులతో కూడి వుండు వాడు అని. "రక్షిత త్యాగరాజ" అంటే, ఈ త్యాగరాజును ఎల్లప్పుడు రక్షించువాడు అని అర్ధం.
ఈ కృతిలోని మిగతా పదాలన్నీ చాలా తెలికైనవే!
మూలం: http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/06/thyagaraja-kriti-rama-kothanda-rama.html
No comments:
Post a Comment