Sunday, 17 June 2012

Gurupaduka Stotramu

జూలై 2009 సాయిబాబా మాసపత్రికలో, శ్రీ శంకరాచార్యులవారు రచించిన - గురుపాదుకా స్తోత్రమును, అందులోని ప్రతీ శ్లోకానికీ భావముతో  సహా, ప్రచురించారు.  ఈ స్తోత్రముయొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తో చక్కటి ఉపోద్ఘాతముకూడా ఈ పత్రికలో వ్రాసారు. ఆ ఆర్టికల్‌ను (నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం) ఈ క్రింది లింకు వద్దనున్న  పత్రికలో చదువుకొనవచ్చును.

ఆ శ్లోకములలో విడి విడిగా ప్రతీ పదానికీ అర్ధములు, ఈ క్రింది లింకు వద్ద ఇంగ్లీషులో ఇవ్వబడ్డాయి:
www.vmission.org.in/files/pdf/gurupadukastotram.pdf

గురుపాదుకా స్తోత్రమును ఇక్కడ వినవచ్చును:

పై రిఫరెన్సులు ఆధారముగా తెలుగులో వ్రాసుకున్న అర్ధాలు వేరే ఎవరికైనాకూడా ఉపయోగపడతాయేమోనని, వాటిని ఇక్కడ జత చేస్తున్నాను:

అనంత సంసార సముద్ర తార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యామ్
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (1)

అనంత సంసార సముద్ర తార = అంతులేని సంసారము అనే సముద్రాన్ని దాటడానికి
నౌకాయితాభ్యాం = నౌక వంటివి
గురుభక్తిదాభ్యామ్ = గురుభక్తిని ప్రసాదించేవి
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యామ్ = పూజించువారికి వైరాగ్య సామ్రాజ్యమును ప్రసాదించునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

అంతులేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నౌకవంటివి, గురుభక్తిని ప్రసాదించేవి, పూజించువారికి వైరాగ్య సామ్రాజ్యమును ప్రసాదించేవి అయిన శ్రీ గురుపాదుకలకు నమస్సులు. 

కవిత్వ వారాశి నిశాకరాభ్యామ్
దౌర్భాగ్య దావాంబుద మాలికాభ్యామ్
దూరీకృతా నమ్ర విపత్తతిభ్యామ్
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (2)

కవిత్వ వారాశి = జ్ఞానము అనే సముద్రానికి
నిశాకరాభ్యామ్ = పూర్ణ చంద్రునివంటివి
దౌర్భాగ్య = దౌర్భాగ్యము అనే
దావా = అగ్నికి
అంబుద = నీటి
మాలికాభ్యామ్ = కుండపోత వంటివి
నమ్ర = వినయముతో ఆశ్రయించినవారి
విపత్తతిభ్యామ్ = కష్టాలను
దూరీకృతా = దూరముచేయునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

జ్ఞానమనే సముద్రానికి పూర్ణచంద్రుని వంటివి, దౌర్భాగ్యమనే అగ్నిని ఆర్పటములో పెను వర్షము వంటివి, వినయముతో ఆశ్రయించినవారి కష్టాలను తొలగించేవి అయిన శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాశ్చ వాచశ్పతితాం హి తాభ్యామ్
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (3)

నతా = (ఎవరైతే) నమస్కరించారో
యయోః = వారు
కదాచిదపి దరిద్రవర్యాః = ఎంతటి నిష్ట దరిద్రులు అయినప్పటికీ 
అశు = వెంటనే
శ్రీపతితాం = మహదైశ్వర్యవంతులుగా
సమీయుః = అగుదురు
మూకాశ్చ = మూగవారిని సైతము
వాచశ్పతితాం హి తాభ్యామ్ = గొప్ప వాక్పటిమగలవారిగా మార్చివేయగలవు
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

ఆ శ్రీ గురుపాదుకలను ఆశ్రయించిన నిష్ట దరిద్రులుకూడా వెంటనే మహదైశ్వర్యవంతులగుదురు. మూగవారిని సైతము గొప్ప వక్తలుగా మార్చివేయగలిగినటువంటి మహత్తరమైన శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

నాలీకనీకాశ పదాహృతాభ్యాం
నానా విమోహాది నివారికాభ్యామ్
నమజ్జనాభీష్ట తతి ప్రదాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (4)

నాలీక నీకాశ = పద్మములు వంటి
పద = పాదములవైపునకు
ఆహృతాభ్యాం = ఆకర్షించునవి
నానా విమోహాది = నానారకములైన వ్యామోహములను
నివారికాభ్యామ్ = నివారించునవి
నమజ్జన అభీష్ట = నమస్కరించిన జనులయొక్క అభీష్టాలను
తతి = విశేషముగా
ప్రదాభ్యాం = ప్రసాదించునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

సద్గురుని పాదపద్మములవైపు మనలను ఆకర్షించేవి, నానా రకములైన వ్యామోహములను నివారించునవి, తమకు నమస్కరించిన జనులయొక్క అభీష్టాలను విషేషముగా తీర్చునవి అగు శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

నృపాలి మౌళి వ్రజరత్న కాన్తి
సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (5)

నృపాలి = రాజుయొక్క
మౌళి = కీరీటమునందలి
వ్రజ రత్న = అమూల్యమైన రత్నములయొక్క
కాన్తి = కాంతితో ప్రకాశించేవి
ఝష = మొసళ్ళతో నిండిన
సరిత్ = సరస్సునందు
కన్యకాభ్యామ్ = కన్యవలే
విరాజత్ = విరాజిల్లేవి
నత లోక పంక్తేః = (తమకు) నమస్కరించు అనేకులైన లోకులను
నృపత్వదాభ్యాం = (అధ్యాత్మిక సామ్రాజ్యపు) రాజులుగా చేయునట్టివి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

రాజుల కిరీటములయందలి అమూల్య రత్నకాంతులను బోలిన కాంతులతో ప్రకాశించేవి, మొసళ్ళతో నిండిన సరస్సులోని అందమైన కన్యవలే విరాజిల్లేవి, తమనాశ్రయించిన అనేకులైన లోకులను అధ్యాత్మిక సామ్రాజ్యపు రాజులుగా తీర్చిదిద్దునవి అగు శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీన్ద్ర ఖగేశ్వరాభ్యామ్
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యామ్
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (6)

పాపాంధకార = పాపాలనే చీకటుల
పరంపరాభ్యాం = పరంపరల పాలిటి
అర్క = సూర్యుని వంటివి
తాప త్రయా హీన్ద్ర = మూడు రకములైన తాపములనెడి సర్పముల పాలిటి
ఖగేశ్వరాభ్యామ్ = పక్షులకు రాజైన గరుడుని వంటివి
జాడ్య = జాడ్యము (తాత్సారము) అనెడి
అబ్ధి = సముద్రమును
సంశోషణ = ఎండగొట్టగలిగిన
వాడవాభ్యామ్ = బడబానలము (భయంకరమైన అగ్ని) వంటివి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

పాపాలనే చీకటుల పరంపరల పాలిటి సూర్యుని వంటివి, అధిభౌతిక, అధిదైవిక, మరియు ఆధ్యాత్మికమనెడి మూడు రకములైన తాపములనెడి సర్పముల పాలిటి గరుడునివంటివి, జాడ్యము (తాత్సారము) అనే సముద్రమును ఎండగొట్టగలిగిన బడబాలనము వంటివి అయిన శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

శమాది షట్కప్రద వైభవాభ్యాం
సమాధి దాన వ్రత దీక్షితాభ్యామ్
రమాధవాంఘ్రి స్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (7)

శమాది షట్క = శమము, దమము మొదలైన ఆరు గుణముల
వైభవాభ్యాం  =  వైభవమును
ప్రద = ప్రసాదించునవి
వ్రత దీక్షితాభ్యామ్ = సాధనావ్రత దీక్షితులైనవారికి
సమాధి దాన = సమాధి స్థితిని దానము చేయునవి
రమాధవ = రమాపతి అయిన శ్రీమహావిష్ణువుయొక్క
అంఘ్రి = పాదములయందు
స్థిరభక్తిదాభ్యాం = స్థిరమైన భక్తిని ప్రసాదించునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

వైభవోపేతములైన శమదమాది ఆరు గుణములను ప్రసాదించునవి, సాధనావ్రత దీక్షితులైనవారికి సమాధి స్థితిని ప్రసాదించేవి, రమాపతియైన శ్రీమహావిష్ణువుయొక్క పాదములయందు స్థిరమైన భక్తిని ప్రసాదించేవి అగు శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యామ్
స్వాంతాచ్చ భావ ప్రద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (8)

స్వ అర్చ పరాణాం = తమను అర్చించుటుయందే పరాయణత కలవారికి
స్వాహా సహాయాక్ష = ఇతరులకు సహాయపడుటలోనే
ధురంధరాభ్యామ్ = నిరంతరము మునిగి ఉన్నవారికి
అఖిలేష్టదాభ్యాం = సకల అభీష్టములను ప్రసాదించునవి
పూజనాభ్యాం = తమను పూజించువారికి
స్వాంతాచ్చ భావ = నిజమైన స్థితిని (ఆత్మజ్ఞానాన్ని)
ప్రద = ప్రసాదించునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

తమను అర్చించుటుయందే పరాయణత కలవారికి, మరియు ఇతరులకు సహాయపడుటలోనే నిరంతరము మునిగి ఉన్నవారికి సకల అభీష్టములను ప్రసాదించునవి,  తమను పూజించువారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించునవి అగు శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

కామాది సర్ప వ్రజ గారుడాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్
బోధ ప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ (9)

కామాది సర్ప వ్రజ = కామము, క్రోధము మొ|| అరిషడ్వర్గములనే సర్పములపట్ల
గారుడాభ్యాం = గరుడుని వంటివి
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం = వివేక వైరాగ్యాలనే నిధులను ప్రసాదించునవి
బోధ ప్రదాభ్యాం = గురుబోధను ప్రసాదించునవి
దృత మోక్షదాభ్యాం = వెనువెంటనే మోక్షమును ప్రసాదించునవి
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ = అట్టి శ్రీ గురుపాదుకలకు నమస్కారము

కామక్రోధాది అరిషడ్వర్గములనే సర్పములపట్ల గరుడుని వంటివి, వివేక వైరాగ్యాలనే నిధులను ప్రసాదించునవి, గురుబోధను ప్రసాదించునవి, వెనువెంటనే మోక్షమును ప్రసాదించునవి అగు శ్రీ గురుపాదుకలకు నమస్సులు.

2 comments:

మోహన్ కిషోర్ నెమ్మలూరి said...

శ్రీ గొర్తి సుబ్రహ్మణ్యం గారికి నమస్కారము,
మీరు నా బ్లాగులో వ్రాసిన అభినందన వాక్యములకు ధన్యుడను. నేను పోస్ట్ చేసిన స్తోత్రములలో ఏమైనా అక్షర/పద విభజన దోషములు ఉంటే తప్పక తెలియజేయగలరు. మీ బ్లాగులో వ్రాసిన గురుపాదుకా స్తోత్రం గురించి కూడా చదివాను. చాలా బాగుందండీ. నేను ఈ మధ్యనే శృంగేరి పీఠం నుండి, ఆదిశంకర భగవత్పాదులు వ్రాసిన అన్ని స్తోత్రములు ఉన్న పుస్తకం ఒకటి తెప్పించాను. అందులో మీరు వ్రాసిన స్తోత్రమూ ఉంది, శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు వ్రాసిన గురుపాదుకా స్తోత్రమూ రెండూ ఉన్నాయి.

మీరు గొర్తి వారు కదా, గుంటూరులో World Teachers Trust వ్యవస్థాపకులు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వారి ప్రత్యక్ష శిష్యుడు శ్రీ గొర్తి లక్ష్మీ నారాయన శాస్త్రి గారు మీకు తెలుసా.. వీరు గుంటూరులో కాలేజీలో భౌతిక శాస్త్ర professor గా చేసి retire అయ్యారు. వీరు లలితా సహస్రనామములకు భాష్యములు కూడా వ్రాశారు. ఆ పుస్తకాలు నాలుగు భాగాలలో ప్రచురించబడ్డాయి. మీ ఇంటి పేరు అదే అయ్యేసరికి అడిగాను, అన్యథా భావించకండి.

ధన్యవాదములతో..
మోహన్ కిశోర్

subrahmanyam Gorthi said...

శ్రీ మోహన్ కిశోర్ గారు,
నమస్కారమండి. Thank you very much Sir for your comment and for the clarification regarding Sri-Guru-Paduka-stotramu.

శ్రీ గొర్తి లక్ష్మీనారాయణశాస్త్రిగారి గురించి తెలియదండి. బహుశా దూరపు బంధువులు అయ్యి ఉండవచ్చునమో. Glad to know about Him and especially to know that He had the fortune to be a direct student of Master EK garu, Thank you Sir for mentioning about this.

ధన్యవాదములతో,
Subrahmanyam.