Showing posts with label Thyagaraju. Show all posts
Showing posts with label Thyagaraju. Show all posts

Friday, 31 December 2010

త్యాగరాజు గారి చిట్టచివరి 2 కృతుల వివరాలు


త్యాగయ్య గారు శ్రీరామునిలో ఐక్యం అవడానికి పది రోజుల ముందర, వారికి శ్రీరాముని పత్యక్ష దర్శనం అయ్యింది. ఆ సంఘటనను గూర్చి వివరంగా, త్యాగయ్య గారు క్రింది కృతిలో వ్రాసుకున్నారు:

ప. గిరి పై నెలకొన్న రాముని
గురి-తప్పక కంటి
(సువేల పర్వత శిఖరంపై నెలకుని ఉన్న శ్రీరామచంద్రమూర్తిని, గురి-తప్పక చూసితిని.
ఇక్కడ  "గురి-తప్పక" అంటే, శ్రీరాముని చూడడం మైకంలోనో లేక కలలోనో కలిగిన బ్రమ/అనుభూతి కాదని, శ్రీరాముని పత్యక్ష దర్శనమవ్వడంలో ఎంతమాత్రం సంశయము/పొరపాటు లేదని చెబుతున్నరేమో? లేదా.... ఆయన లక్ష్యం (గురి) అయిన శ్రీరాముని ప్రత్యక్ష దర్శనాన్ని పొందానని చెబుతున్నరేమో?)
 
అ.ప. పరివారులు విరి సురటులచే
నిలబడి విసరుచు కొసరుచు సేవింపగ (గిరి)
(శ్రీరాముని యొక్క పరివారము ఆయనచుట్టూ నిలబడి, పూలతో చేసిన చామరములతో విసురుతో వున్నప్పుడు, గిరిపై  నెలకుని ఉన్న శ్రీరాముని గురి తప్పక చూసితిని.)

చ. పులకాంకితుడై ఆనంద-అశ్రువుల
నింపుచు మాటలు-ఆడ వలెను-అని
కలవరించ కని పది పూటల పై
కాచెదను-అను త్యాగరాజ వినుతుని (గిరి)
(శ్రీరాముని చూడడంతో పులకాంకితుడై, కన్నులు ఆనందాశ్రువులతో నిండిన త్యాగరాజు, "రామా, నీతో మాట్లాడవలెను" అని అనగా, అప్పుడు శ్రీరాముడు, "నిన్ను పది రోజుల తర్వాత కరుణించెదను" అని చెప్పెను. )

శ్రీరాముని దర్శనం అయిన తర్వాత తొమ్మిదవనాడు (శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు రోజు) త్యాగయ్య గారు సన్యాస దీక్ష తీసుకున్నారట. అప్పుడే, వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత, వారిని యెక్కడ ఎలా సమాధి చెయ్యాలో కూడా వారి శిష్యులకు చెప్పారట.

ఆ మరుసటి రోజున (పదవ నాడు), పూజానంతరం, తన్మయత్వంతో, ఈక్రింద వ్రాసిన కృతిని పాడుతో, శరీరాన్ని విడిచిపెట్టి, రామునిలో ఐక్యం అయ్యారట!
ఇదే వారు వ్రాసిన చిట్టచివరి కృతి:

ప. పరితాపము కని-ఆడిన
పలుకులు మరచితివో నా (పరి)
(శ్రీరామా, నా దయనీయమైన స్థితిని చూసి నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)

అ.ప. సరి-లేని సీతతో
సరయు మధ్యంబున నా (పరి)
(నీవు సాటిలేని సీతమ్మ తల్లితో సరయూనది యందు వున్నప్పుడు, నా దయనీయమైన స్థితిని చూసి నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)

చ. వరమగు బంగారు వాడను
మెరయుచు పది పూటల-పై
కరుణించెదను-అనుచు క్రే-
కనుల త్యాగరాజుని (పరి)
(నీవు అప్పుడు చక్కనైన బంగారు నావలో ప్రకాసిస్తో, నా దయనీయమైన స్థితిని
క్రేగంటచూసి, "పది రోజుల తర్వాత నిన్ను కరుణించెదను" అని నీవు పల్కిన మాటలు మరిచిపోయావా?)


References:
http://sahityam.net/wiki/Parithapamu
http://sahityam.net/wiki/Giripai_Nelakonna
http://www.eemaata.com/em/issues/200905/1435.html?allinonepage=1
http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/12/thyagaraja-kriti-giripai-nelakonna-raga.html
http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/09/thyagaraja-kriti-parithaapamu-raga.html

Tuesday, 23 November 2010

నిధి చాల సుఖమా?

త్యాగరాజు గారు పదమూడు సంవత్సరాలు వయసు నుండే అనేక కీర్తనలను వ్రాసి స్వరపరిచారు. ఆయన గురువుగారు శ్రీ సొంఠి వెంకటరమణయ్య గారు త్యాగయ్య గారి ప్రతిభకు ఎంతగానో సంతోషించి, ఆయన గొప్పతనం గురించి తంజావూరు మహారాజుకి చెప్పగా, ఆ రాజుగారు అనేక ధన కనక వస్తు వాహనాది రాజ లాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజుగారు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే "నిధి చాల సుఖమా..."  అనే ఈక్రింది చక్కటి కీర్తన:

ప. నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా

అ. దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని)

చ. దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా (ని)

భావం:

ఓ మనసా, నిజంగా చెప్పు:

  • రాముని యొక్క సన్నిధిలోనుండి ఆయన సేవ చేసుకోవడం సుఖమా? లేక భౌతికమైన ఐశ్య్వర్యాలను అనుభవించడం సుఖమా?
  • పెరుగు, అప్పుడే తీసిన వెన్న, పాలు మొ|| పదార్దములు రుచియా? లేక శ్రీరాముని ధ్యాన భజనములు అనెడి  అమృత-రసము రుచియా?
  • శమము, దమము (శాంతి/పవిత్రత, ఇంద్రియ నిగ్రహము) అనెడి గంగా స్నానము సుఖమా? లేక  చెడు విషయములు అనెడి మురికితో నిండిన బావినీటి స్నానం సుఖమా?
  • అహంకార మమకారాలు అనే బంధాలలో చిక్కుకుని వున్న సామాన్య మానవులను స్తుతించడం సుఖమా? లేక, ఓ మనసా, ఈ త్యాగరాజుచే స్తుతింపబడుతున్న శ్రీరాముని కీర్తన చేయడం సుఖమా?

ఈపాటను నాగయ్య గారు తీసిన త్యాగయ్య సినిమాలో చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆ పాటను క్రింది లింకులో చూడగలరు.




References:

http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/09/thyagaraja-kriti-nidhi-chala-sukhama.html
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81
 

Saturday, 20 November 2010

రామ కోదండ రామ రామ కల్యాణ రామ

వాల్మికి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో 24,000 శ్లోకాలలో వ్రాసారు. అలానే, శ్రీరాముని కీర్తిస్తో త్యాగరాజు గారు, మన తెలుగులో, 24,000 కృతులను వ్రాసారట! అందులోనుంచి మనకు కూడా అర్ధమయ్యే తెలుగు పదాలలో :-) వ్రాయబడిన, తేలికైన ఒక ఆణిముత్యం:


ప. రామ కోదండ రామ రామ కల్యాణ రామ

చ1. రామ సీతా పతి రామ నీవే గతి
రామ నీకు మ్రొక్కితి రామ నీ చే జిక్కితి (రా)

చ2. రామ నీకెవరు జోడు రామ క్రీ-కంట జూడు
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు (రా)

చ3. రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు (రా)

చ4. రామ నీకొక మాట రామ నాకొక మూట
రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట (రా)

చ5. రామ నేనెందైనను రామ వేరెంచ లేను
రామయెన్నడైనను రామ బాయక లేను (రా)

చ6. రామ విరాజ రాజ రామ ముఖ జిత రాజ
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ (రా)


రెండవ చరణంలో, "క్రీ-కంట" అంటే, ప్రక్క నుంచి చూడటం: రామా, కనీసం ఒక్కసారి నావైపు క్రీ-కంట అయినా చూడు అని ప్రార్ధిస్తున్నారు.

మూడవ చరణంలో, "రాయుడు" అంటే, రాజు (lord) అని అర్ధం.

ఐదవ చరణంలో, "రామ నేనెందైనను రామ వేరెంచ లేను" అంటే: రామా, నేను ఎటువంటి పరిస్థితులలో వున్నా(ఎందైనను), నిన్ను తప్ప ఇంకొక (వేరు) విషయాన్ని గురించి ఆలోచించలేను (ఎంచ లేను). "బాయక లేను" అంటే, విడిచి ఉండలేను అని అర్ధం.

ఆరవ చరణంలో, "విరాజ" అంటే: పక్షిరాజు గరుత్మంతుడు. "విరాజ రాజ" అంటే, గరుత్మంతునికి రాజైన విష్ణుమూర్తి. "రామ ముఖ జిత రాజ" అంటే రాముని వదనము(ముఖ) చల్లదనము/ఆనందము ప్రసాదించడంలో చంద్రుని(రాజ) కూడా ఓడించినది(జిత) అని అర్ధం "రామ భక్త సమాజ" అంటే, భక్తులతో కూడి వుండు వాడు అని. "రక్షిత త్యాగరాజ" అంటే, ఈ త్యాగరాజును ఎల్లప్పుడు రక్షించువాడు అని అర్ధం.

ఈ కృతిలోని మిగతా పదాలన్నీ చాలా తెలికైనవే!


మూలం:  http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/06/thyagaraja-kriti-rama-kothanda-rama.html