Sunday 7 August 2011

Ordering the book Sannidhi



"సన్నిధి - శ్రీ పాకలపాటి గురువుగారి దివ్య చరిత్ర"  పుస్తక ప్రతులను ఈ క్రింది చోటునుండి పొందవచ్చు:
శ్రీ పాకలపాడు గురుదేవుల ఆశ్రమం,
బలిఘట్టం, ఉత్తరవాహిని తీరము,
నర్సీపట్నం, విశాఖపట్టణం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్.


ఫోను నెం: 08932-286697
పుస్తకం వెల: రూ|| 35-00

This book can be also ordered online (using credit card) from the following site:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=9067

Please refer to my previous posting here for more details...
 
ఈ గ్రంథంలోనుండి,  మచ్చుకకు, మూడు మధుర ఘట్టాలను మాత్రం ఇచ్చట ముచ్చటించుకుందాము! తక్కిన వాటిని పై పుస్తకంలో చదువగలరు :-)

(1) ఉపదేము (పేజి: 118):

నర్సీపట్నం కరణంగారైన  రామకృష్ణా రావుగారు బాబుగారి భక్తులు; వారితో చనువు ఎక్కువ. ఒక రోజు బాబుగారితో, "వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించడానికి బదులు ఏ ఉపదేశమైనా ఇస్తే బాగుంటుంది కదా!" అని అన్నారు.

బాబుగారు, "నీకు ఉపదేశమిస్తాను తీసుకుంటావా?" అని అడిగారు. "తప్పకుండా తీసుకుంటాను" అన్నారు. అప్పుడు బాబుగారు ఎదురుగా వున్న మామిడి చెట్టును చూపించి, దాని క్రింద 20 నిముషాలు కూర్చుని రమ్మనగా 5 నిముషాలులోనే తిరిగి వచ్చేసారట. బాబుగారు కారణమేమని అడుగగా, ఆ ప్రదేశమంతా చీమల మయము, అందుకే వచ్చేసానని చెప్పారు. "చీమలకు భయపడిన వాడివి దీక్ష ఏమి చేస్తావు? అందుచే నేను అందరికీ కావలసిన భోజనము సమకూర్చుతాను. వారి వారి యోగ్యతలను బట్టి వారు నా నుండి నేర్చుకుంటారు" అని చెప్పగా రామకృష్ణా రావుగారు సిగ్గుతో తల వంచుకునిరి.

(2) విశ్వాసము (పేజి:134):

భూసుర్లకోట అనే గ్రామంలో ఒక చిన్న ఆశ్రమంలో గురువుగారు వుండగా ఈ సన్నివేశం జరిగింది: అక్కడికి 20-30 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం వున్నది. ఓ ఇల్లాలు భర్త కోసం గంపలో చల్ది అన్నం పెట్టుకుని పొలానికి వెళ్ళింది. దుక్కు చేస్తున్న భర్తను నాగు పాము కరిచింది. వాడు పడిపోయి నురగలు కక్కుతో దొర్లుతున్నాడు. అటువంటప్పుడు ఏ ఆడకూతురూ భర్తను విడిచి వెళ్ళదు. కానీ ఆమెకు శ్రీ బాబు గారంటే అపారమైన నమ్మకం. వెంటనే బయలుదేరి, గురువుగారు వున్న చోటుకు కొన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చింది. "మీ శిష్యుడు చనిపోయాడు బాబూ!" అని ఏడ్చుకుంటో చెప్పింది. ఉదయమనగా ఈ సంఘటన జరిగితే, సాయంత్రానికి (అంత దూరం నడచి) వచ్చి చెప్పింది. గురువుగారు లుంగీ పంచె కట్టుకుని ఉన్నారు. ఆ లుంగీ పంచె అంచు చింపి, మూడు ముళ్ళు వేసి, అది ఆమె చేతికిచ్చి, "అది ఆ తుప్పల మీద పడేసి రా" అన్నారు. ఆమె పడేసింది. ఇలాంటి సందర్భాలలో ఒక్కొక్కసారి  శ్రీవారు తమ యజ్ఞోపవీతాన్ని కూడా త్రెంపేసేవారు. ప్రమాదం గట్టెక్కగానే, నూతన యజ్ఞోపవితం వేసుకునేవారు. "చిన్న బాబూ! ఇప్పుడు టైం ఎంత అయ్యిందో నోట్ చెయ్యి" అన్నారు. నోట్ చేసారు. అంతే! ఆమె ఎంతో ఆనంద పడిపోయింది. భర్త చనిపోయాడన్న ధ్యాసే లేదు. (గిరిజనులు నమ్మితే అలా నమ్ముతారు. వారు అమాయకులు; అంటే తెలివి తక్కువ వారని కాదు, మాయ లేనివారు అని అర్ధము.) వెంటనే ఆమె స్నానం చేసి, బాబు గారిని పంచె అడిగింది; దాన్నే చీరలా కట్టుకుంది. చక్కగా భోజనం చేసి ఆ రాత్రి నిశ్చింతగా పడుకున్నది. ఉదయం లేచి "బాబూ! చిన్న విభూతి ఇవ్వు" అని అడిగి తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళింది.
నాలుగు రోజుల తర్వాత భార్యా భర్త లిద్దరూ బుట్ట నిండా కమలాలు పట్టుకుని వచ్చారు. "ఏం జరిగిందిరా?" అంటే "బాబూ.. నేను పడిపోవడమే నాకు తెలుసుగానీ, మిగిలిన విషయాలేమీ నాకు తెలియవు. ఊరిలోనికి  తీసుకు వెళ్లారు, ఫలానా సమయానికి తెలివి వచ్చింది బాబు" అని చెప్పాడు (అది చిన బాబుగారు నోట్ చేసుకున్న సమయానికి సరిగ్గా సరి పోయింది).

(3) ముక్తి  (పేజి: 144):

ఒక గిరిజన పల్లెలో బాలందొర అనే గిరిజనుడు ఉండేవాడు. భక్తుడు. పదహారు మంది సంతానం. అందరికీ సమానమైన భాగమిచ్చాడు. ఒక రోజు గురువుగారు అతనితో, "ఒరే, ఫలానా సంవత్సరం, ఫలానా అమావాస్యనుంచి  రెండు రోజుల తర్వాత రోజున నీవు కాలంచేస్తే చెయ్యొచ్చును రా" అన్నారు. ఇలా చాలా సంవత్సరాల ముందే చెప్పారు. ఈలోగా, తాను చెయ్యాల్సిన పనులన్నీ చక్కగా గురువు గారి అనుగ్రహం వల్ల నిరవేర్చాడు. 82 సంవత్సరాల వయస్సులో కూడా పిడుగులా ఉన్నాడు! అప్పుడు కూడా చేలోకి వెళ్లి దుక్కి చేసుకుంటున్నాడు. ఇంకా నాలుగు రోజుల్లో చనిపోతాడనగా, ఒక చెట్టు నీడన వట్టి గడ్డి పేర్పించి దానిమీద పడుకున్నాడు.  పిల్లలకు ఏమీ చెప్పలేదు. వానికేమీ జబ్బు లేదు. పిల్లల్లో ఎవరో వెళ్లి బాబుగారికి ఈ విషయం చెప్పారు. సరిగ్గా అతడు శరీరం విడుస్తాడనే రోజుకు వెళ్లారు బాబు. "యేమిరా ఇలా పడుక్కున్నావ్? నీకేం పోయే కాలమా?" అన్నారు బాబు. "పడుకోవలనిపించింది, పడుకున్నా" అన్నాడు ఆ అపర భీష్ముడు! మొత్తం కొడుకులను కూతుళ్ళను పిలిచాడు. వాడి చెయ్యి కూడా వేసాడు. అప్పటి వరకూ పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. గురువుగారి చెయ్యి కూడా మధ్యలో పెట్టించి, అలా జరిగి, తన తల గురువుగారి తొడ మీద పెట్టుకుని, ఠక్కున చచ్చి పోయాడు. బాబుగారు స్నానం చేసి అగ్నిహొత్రం  పట్టుకుని కొంత దూరం నడిచారు. చినబాబుకి అగ్నిహొత్రమిచ్చి, శవానికి ఒక కొమ్ము కాసి, కొంత దూరం మోసారు. ఒక కడపటి జాతి (మన దృతరాష్ట-దృష్టిలో!) గిరిజనునికి బాబుగారు స్వయంగా అగ్ని సంస్కారం చేసారు. నర్సీపట్నం నుంచి సరుకులు తెప్పించి కొన్ని వేలమందికి సమారాధన చేయించారు. ఎప్పుడు చనిపోతామో తెలియకపోయినా, తామొకనాడు చనిపోతామన్న విషయం అందరికీ తెలుసు. కానీ బాలందొరలా ఏ కొందరో తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. బాలందొర కేవలం మన్య జీవి కాడు, ధన్య జీవి.

No comments: