Thursday, 12 January 2012

Master Gurdjieff


కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు, తైత్తరీయ ఉపనిషత్తుపై (ఆనందవల్లిపై) చేసిన తమ ప్రవచనంలో, ఒక సందర్భంలో, గుర్జీఫ్ (1877-1949) అనే మహనీయునిగూర్చి చెప్పి, వారు చెప్పిన ఒక సూక్తికి చక్కటి వివరణను సోదాహరణంగా ఇచ్చారు. మాస్టర్ గుర్జీఫ్ గురించి కృష్ణమాచార్యులుగారు తెల్పిన విషయాలు వారి మాటలలోనే ఇక చదివి ఆనందిద్దాము !

ఎదటివాడు మనకు ఎప్పుడు అపకారం చెయ్యగలడంటే... గుర్జీఫ్ (Gurdjieff) అనే ఒక మాస్టర్ (ఆయననే కజేషియన్ (Caucasian) మాస్టర్ అని కూడా అంటారు) చాలా అద్భుతంగా చెప్పాడు: "Your enemies can harm you ONLY WHEN you have the immorality to care for them" అన్నాడు. అంటే, "వాళ్ళను గురించి నువ్వు భయపడేంత అవినీతి, దానికి కావలిసినంత కక్కుర్తి, నీలో ఉన్నరోజునే, వాడు నిన్నేమైనా చెయ్యగలడు." ఆయన వాక్యాలలో చాలా పరమ సత్యాలు ఉన్నవి.  నికల్సన్ (Nicoll?)  మొదలైన మహానుభావులైన శిష్యులు, ఆయన ఒక్కొక్క వాక్యానికి,  15-25 పేజీల వ్యాఖ్యానాలను, "కామెంటరీస్" అన్న పేరుతో volumes (పుస్తకాలు) వ్రాసారు;  జాగ్రత్తగా చదువుకోవాలి.


గుర్జీఫ్ అనేటువంటివాడు చాలా పెద్ద గురువుగారు. ఆయన శిష్యులు ఇప్పుడు పారిస్లో ఒక గ్రూప్ ఉన్నారు. అక్కడకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను (కృష్ణమాచార్యులుగారు చెబుతున్నారు); వాళ్ళందరూ చాలా ఉత్తములైనటువంటివారు. ఆశ్చర్యకరమైన విషయాలు గుర్జీఫ్ ఇంకా చాలా చెప్పారు: "Everyone, while speaking of others, speaks of HIMSELF" అనే ఒక వాక్యం ఇచ్చారు గుర్జీఫ్. అంటే, "ప్రతివాడూ ఇతరుల గురించి మాట్లాడుతున్నవన్నీ, తనగురించే!" ఇదొక పరమ సత్యం.


ఇట్లాంటివన్నీ, మరీ దబ్బనం పెట్టి గుండెకాయ మీద పొడిచినట్టు ఉంటాయి; అసలు చదువుకోకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది మనకు! ఆయన జీవించి ఉన్నప్పుడుకూడా శిష్యులను అలాగే చెండుకు తిన్నాడు! కెన్నెత్ వాకర్ (Kenneth Walker) అనే ఒక సైకాలజిస్ట్ ఆయన శిష్యుడు; వాణ్ణి, 10  సంవత్సరాల శిష్యరికం ఐన తర్వాత, "నా దగ్గర ఉండడానికి పనికిరావు, నువ్వు తుచ్చుడివి, వెళ్ళిపో" అని వెళ్ళగొట్టాడు.  కొన్ని సంవత్సరాలు ఐన తర్వాత సడన్‌గా ఒక రోజు అతనికి కబురు పంపించాడు. "ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు జరగవలిసినటువంటి కొంత ట్రైనింగ్లో  నా దగ్గర ఉండకూడదు. అందుచేత నిన్ను దూరంగా పంపించేసాను. ఆ ట్రైనింగు పూర్తి అయ్యింది. అందుచేత నిన్ను చూడాలనిపించి పిలుస్తున్నాను,"  అని కబురు పంపించాడు. వాడు నిజమే అనుకుని, వచ్చి దర్శించుకున్నాడు. ఆతర్వాత, అదేరోజు సాయత్రం ఆయన (గుర్జీఫ్) శరీరం విడిచిపెట్టేసాడు. అలాంటివాడు ఈ గుర్జీఫ్ అనేటువంటి ఆయన. పై రెండు వాక్యాలుకూడా ఆయన చెప్పినటువంటివే.

కనుక, పరిస్తితులవలన మనకు భయము ఎప్పుడు కలుగుతుంది అంటే, "పరిస్తితులతో నీకు ఉన్న కక్కుర్తిని బట్టి నాయనా!" అన్నాడు. మా నాన్నగారు (శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులుగారు) గుంటూరులో ఇంటర్-మీడియెట్ చదువుకుంటున్న రోజులలో సంగతి ఇది: ఒక సాధువుగారు ఆ ఊర్లో ఒకరి ఇంటిలోకి వచ్చి చేరి, అలా జపం చేసుకుంటో ఉన్నారు. ఒక రోజు ఆయన, ఆ ఇంట్లో వాళ్ళని పూజకోసం ఒక చిన్నంఎత్తు బంగారం ఇవ్వమని అడిగారు. జపం అయ్యిపోయాక, ఆ ఇంట్లో వాళ్ళకి రెండు చిన్నాల బంగారం తిరిగి ఇచ్చాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన భార్య తన భర్తతో, "ఏమండీ, మరి కొంచం బంగారం ఇద్దాం" అంది. అసలు విషయం ఇక్కడ ఉంటుంది; అంటే వాడు మన నెత్తిన మేకు కొట్టడానికి, మేకున్నూ మరియు సుత్తె కూడా మనమే ఇస్తాం. అవి అవతలవాడి దగ్గర ఏమీ ఉండవు. ఇలా ఒక ఇరవై రోజులు గడిచేటప్పడికి, ఆ సాధువుగారు వాళ్ళచేతే ఓ కుండ తెప్పించి, వాళ్ళనేమి అడిగాడంటే, "మీ ఇంట్లో ఉన్న నగలన్నీ పట్రండి, మీరే అవి ఆ కుండలో పెట్టి మూత పెట్టండి. ఏడు రోజులపాటు ఈ కుండకి రాత్రింబగళ్ళు మూత తియ్యకుండా పూజ చేయ్యాలి. అది పూర్తయ్యేవరకూ మధ్యలో మూత తియ్యకూడదు. అప్పుడు ఆ కుండలో ఉన్న బంగారానికి రెండు రెట్లు వస్తుంది. మరి ఆ దీక్ష మొదలు పెడదామా?" అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటావిడ, "మా చెల్లెలిని కూడా పిలిపిస్తాను అన్నది." ఆ సాధువుగారు, "సరే ఐతే, అలాగే పిలిపించండి" అన్నాడు. ఆవిడని పిలిపించారు. "మా అక్కయ్యను కూడా పిలిపిస్తానండి" అన్నది. ఆవిడని కూడా పిలించారు. ఇట్లాగ, 18 కుటుంబాలు (మహాభారతం 18 పర్వాలు అన్నట్లుగా!) దీనికి ఒప్పుకున్నారు, నమ్మారు, వచ్చి వాళ్ళ బంగారాలన్నీ ఆ కుండలో పెట్టారు. మిగతా కుటుంబాలవాళ్ళని ఇంకా కొంతమందిని పిలిచారుగానీ, వాళ్ళు మాకు అఖ్ఖరలేదు అన్నారు.

దీక్ష మొదలైంది; రెండు రోజులు ఐన తర్వాత, మూడవ రోజు ఇంక ఆ గురువుగారు కనిపించలేదు. దీక్షలో బంగారం పెడుతో ఆయన ఏంచెప్పాడు అంటే, "ఏడు రోజుల లోపులో గనుక మూత తీసినట్లైతే, ఈ కుండలో ఉన్న బంగారం మొత్తమంతా రాజరాజేశ్వరీ అమ్మవారి వద్దకు వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. అందుకని, భయంతో ఏడుస్తో, ఏడు రోజులూ, మూత తియ్యకుండా అలానే ఉంచారు. ఏడు రోజులు ఐన తర్వాత మూత తీసి చూసేటప్పడికి, ఇంకేముంది, ఘటాకాశం ఫఠాకాశం అని శంకరాచార్యులవారు చెప్పింది అక్కడ సాక్షాత్కరించింది!


"చూసారా, సాధువుగారు ఎలా చేసారో?" అన్నారు. సాధువుగారు చెయ్యలేదు. ఒకవేళ సాధువుగారే గనుక కర్త అయ్యివుంటే, అందరినీ చేసి ఉండేవాడు కదా! మనలో ఉన్న అసాధు-లక్షణమే కర్త. "మన కక్కుర్తి వల్లనే ఎదటివాడు మన నెత్తిన మేకు కొడతాడు" అని పైన గుర్జీఫ్ చెప్పింది అందుకని మనం తెలుసుకోవాలి. ఎప్పుడూకూడా అక్షరాలా అదొక్కటే సత్యం. ప్రపంచంలో ఎవ్వడూ ఎవ్వడికీ అన్యాయం చెయ్యగలిగినటువంటి స్థితిగానీ, అవకాసంగానీ లేకుండా ప్రకృతి మేకులు బిగించి ఉంచింది. మనకి మనమే మన కక్కుర్తి వలన మేకులు తయారుచేసి ఎదటివాడికి ఇస్తాము!

No comments: